ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కారు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ సిట్‌కు అధ్యక్షుడిగా పనిచేయనున్నారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కమలేశ్వర్ సింగేనవర్, శంషాబాద్ డీసీపీ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డి దీనిలో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ హోం శాఖ కార్యదర్శి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని తాజాగా హైకోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తును నిలిపివేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను కోర్టు రద్దు చేసింది. దర్యాప్తును ఎక్కువ కాలం వాయిదా వేయడం సబబు కాదని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం అభిప్రాయపడింది.













