సింగరేణిలో ఆస్ట్రేలియా సాంకేతికతపై చర్చలు

సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యసాధనకు ఆధునిక మైనింగ్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. సింగరేణి భవన్‌లో మైనింగ్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం విషయమై ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్ డెనిస్ ఈటెన్‌తో సీఎండీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం సింగరేణిలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ఈ ఏడాది సాధించిన రికార్డు ఉత్పత్తి, రవాణా, టర్నోవర్, సంస్థ వృద్ధిరేటు తదితరాలను ఈ సందర్భంగా డెనిస్ ఈటెన్‌కు సీఎండీ వివరించారు. బొగ్గు ఉత్పత్తిలో పాటు వ్యాపార విస్తరణలో భాగంగా థర్మల్, సోలార్ రంగాల్లోకి కూడా అడుగుపెట్టామని, ఇతర రంగాల్లోని అవకాశాలను సైతం పరిశీలిస్తున్నట్లు వివరించారు. సింగరేణి ప్రాంతంలో నూతన వ్యాపార విస్తరణ చర్యల పరిశీలనకు నవంబరులో ఆస్ట్రేలియా బృందం పరిశీలిస్తుందని డెనిస్ ఈటెన్ వివరించారు. ఈ సమావేశంలో బిజినెస్ డెలప్‌మెంట్ మేనేజర్ రామకృష్ణ పాల్గొన్నారు.