వైఎస్ షర్మిల పార్టీలోకి సానియా మీర్జా చెల్లెలు ?
తెలంగాణలో కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల గురించి హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ ఏర్పాటు కోసం ఆమె అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ అభిమానులతో వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఐతే పార్టీ ప్రకటనకు ముందే పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఆమెను కలిసి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా, ఆమె భర్త, అజారుద్దీన్ తనయుడు మహమ్మద్ అసుదుద్దీన్ వైఎస్ షర్మిలను కలిశారు. త్వరలోనే వైఎస్ షర్మిల కొత్త పార్టీపై ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఆమెను కలిసి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఆనం మిర్జా, అసుదుద్దీన్ కూడా ఆమెను కలవడంతో వారిద్దరూ షర్మిల పార్టీలో చేరబోతున్నారే ప్రచారం జరుగుతోంది.













