గద్దర్‌కు ఏంటీ దుస్థితి..?
గద్దర్‌ను ప్రజా యుద్ధనౌక అంటారు. కమ్యూనిజంకోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. తన పాటలతో యువతను ఉర్రూతలూగించారు. ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించారు. ఒక్పుపుడ గద్దర్ అంటే అదో రెస్పెక్ట్. ఆయన్ను కలవాలని, మాట్లాడాలని.. ఇలా ఎన్నెన్నో కోరికలు. కానీ ఇదంతా గతం. కానీ ఇప్పుడు గద్దర్ పరిస్థితి వేరు. ఇప్పుడు తన ఉనికి కోసం గద్దర్ పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఒకప్పుడు తనకోసం క్యూ కట్టిన నేతలు దగ్గరకు వెళ్లి అడుక్కోవాల్సిన దుస్థితి. గద్దర్ కు ఎందుకొచ్చిందీ పరిస్థితి..?
గద్దర్ ఖద్దర్ చొక్కా తొడుగుతున్నారు. ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తొలిసారి ఎన్నికల రణక్షేత్రంలోకి దూకుతున్నారు. మునుగోడులో కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. గద్దర్ పాల్ పార్టీలో చేరడమేంటి.. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడమేంటి.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వాస్తవానికి రాజకీయాల్లోకి రావాలని గద్దర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్, బీజేపీలను కూడా సంప్రదించారు. గద్దర్ పార్టీ ఆఫీసుల గడప తొక్కడంపై అనేక విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో ఆయన చినజీయర్ స్వామీజీ కలిసి ఓ పాట పాడారు. అప్పట్లో అది అనేక విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత ప్రధానితో కలిసి బీజేపీ వేదికను కూడా పంచుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా కలిసారు. అయితే ఆ రెండు పార్టీల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దీంతో చివరకు పాల్ నే నమ్ముకున్నారు. పాల్ పార్టీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు.
గద్దర్ నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలంగాణలో ఏమాత్రం ప్రభావం లేని పార్టీ కేఏ పాల్ ది. అలాంటి పార్టీ తరపున గద్దర్ ఎందుకు పోటీ చేయాలనుకున్నారనేది అంతుచిక్కడం లేదు. ఒకవేళ గద్దర్ నిజంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటే కేసీఆర్ ను కలిసి ఆ మాట చెబితే ఆయన అవకాశం ఇచ్చేవారేమోననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ తో సన్నిహితంగా ఉన్నాయి. కమ్యూనిస్టుల ద్వారా గద్దర్ తన రాజకీయాభిలాషను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఉండొచ్చు. తద్వారా ఆయన కోరికను నెరవేర్చుకుని ఉండొచ్చు. కానీ ఆయన టీఆర్ఎస్ ను కానీ, కమ్యూనిస్టులను కానీ సంప్రదించినట్లు సమాచారం లేదు.
గద్దర్ మంచి వ్యక్తి. వ్యక్తిగతంగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితులు. ఇప్పుడు మునుగోడు ప్రజలకు కూడా ఆయనంటే అభిమానం ఉండొచ్చు. కానీ ఆయన్ను గెలిపించి అసెంబ్లీంక పంపించేంత అభిమానం ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. ఇందుకు తాను ఎన్నుకున్న పార్టీనే కారణం. కె.ఏ.పాల్ తరపున కాకుండా కమ్యూనిస్టుల అభ్యర్థిగానో, ప్రధాన పార్టీల నుంచో పోటీ చేసి ఉంటే గద్దర్ కచ్చితంగా సత్తా చాటేందుకు అవకాశం ఉండేది. తన ముందు అవకాశం ఉండి కూడా గద్దర్ ఉపయోగించుకోలేకపోయారని పలువురు భావిస్తున్నారు. ఏదైతేనేం.. గద్దర్ నిర్ణయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.













