మునుగోడు పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరం
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే పాదయాత్రకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారు. కరోనా లక్షణాలతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. కరోనా పరీక్షకు శాంపిల్సను పంపించారు. కాగా మునుగోడు పాదయాత్రకు రేవంత్ రాకూడదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పాదయాత్రకు వెళ్లకుండా రేవంత్‌ని ఆపాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌ను కోమటిరెడ్డి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఏఐసీసీ ప్రతినిధులు బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కోమటిరెడ్డి పట్టు వీడడం లేదని పార్టీ వర్గాల సమాచారం. కాగా, మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. దీంతో అన్ని పార్టీలు ఉప ఎన్నికల కసరత్తును ప్రారంభించాయి.













