ఇది నిజంగా తెలంగాణ సమాజానికి బ్లాక్ డే : రేవంత్
తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఏమాత్రం స్పందించలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ సజ్జల చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉందని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్రణాళికలతో జరిగిందని, ప్రజలకు కేసీఆర్ చేస్తున్న ద్రోహమిది అని మండిపడ్డారు. ఇది నిజంగా తెలంగాణ సమాజానికి బ్లాక్ డే అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర మనుగడను గుర్తించడానికి కూడా సీఎం కేసీఆర్ అంగీకరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మేధావులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని, ఈ రోజు నుంచి కేసీఆర్‌కు తెలంగాణ పేగు బంధం తెగిపోయిందని వ్యాఖ్యానించారు.













