శంకరనారాయణ జీవితంపై పరిశోధన

చొప్పరపు శ్రీనివాసరావుకు పిహెచ్‍డి ప్రదానం
ఒక తెలుగు జర్నలిస్టు జీవితం మీద, ఆయన చదువుకున్న ఓ విశ్వవిద్యాలయం పిహెచ్‍డి ప్రదానం చేయటం మామూలు విషయం కాదు. హాస్యానికి చిరునామాగా ఉంటూ, మాటలతో మనల్ని నవ్వించే ఆ వ్యక్తి శంకరనారాయణ. ప్రముఖ జర్నలిస్టుగా, కాలమిస్టుగా కూడా పేరు తెచ్చుకున్న ఆయన తన మాటలతో, కలంతో తెలుగుభాషకు వెలుగు తీసుకువచ్చారు. 425కి పైగా హాస్యావధానాలతో ప్రపంచాన్ని నవ్వించిన ఆయన పత్రికల్లో ఎన్నో కాలమ్స్ లను నిర్వహించారు. ఫన్ గన్, ఫన్ దేహాలు, టెలి ఫన్ ….వగైరా ఫన్ బాణాల్ని తన అక్షయ అక్షర హాస్య తూణీరంలోంచి గత నాలుగు దశాబ్దాలుగా సంధిస్తున్న శంకర నారాయణకు ఇక్కడే కాదు…విదేశాల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తానా మహాసభల్లో, కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటున్నారు. ఇటీవలే ఆటా వారు నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఆయన పాలుపంచుకుంటూ విదేశాల్లో కూడా తనదైన ముద్రను వేశారు.
హాస్యబ్రహ్మ శంకరనారాయణ జీవితం- రచనా విన్యాసాలు అనే అంశంపై గుంటూరు న్యాయవాది చొప్పరపు శ్రీనివాసరావు చేసిన పరిశోధనకుగాను ఆయనకు పిహెచ్‍డి ఇస్తున్నట్లు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రకటించి ప్రదానం చేసింది. కాగా శంకరనారాయణ నాగార్జున యూనివర్సిటీ మొదటిబ్యాచ్ ఎంఎ తెలుగు విద్యార్థి కావడం గమనార్హం.
తన ఇంట్లో తనకే జాగా లేకుండా చేస్తున్న బిరుదులు (గౌరవ డాక్టరేట్లు సహా), అవార్డులు, సత్కారాల తాలూకు ఫొటోఫ్రేములు, శాలువాలు, ప్రశంసా పత్రాల మధ్య ఒదిగి కూర్చుంటూ కూడా, థీసిస్‍లకి సరిపడేటంత ఫన్ గామాల్ని, (కరోనా కాలంలో) మాస్కోడిగామాల్ని సృష్టిస్తున్న ఈ ‘హాస్యబ్రహ్మ‘ శంకర నారాయణుడు – ఈనాడు, ఆంధ్ర ప్రభ వంటి పలు సంస్థల్లో పాత్రికేయుడిగా చెరిగిపోని పంచ్ ముద్రలు వేసిన ‘కలం’కారుడు కావటం జర్నలిస్టులకు, తెలుగు హాస్యప్రియులకు గర్వకారణం.