ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయా? : ప్రియాంక గాంధీ
తెలంగాణలో యువశక్తి, నారీశక్తిని చూస్తే గర్వంగా అనిపిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే, మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందని ఆరోపించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరాలి. ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయా, లేదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈ పదేళ్లలో ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందన్నారు. ఈ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో ఎంతో అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్ గెలిస్తే నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయి. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. పేపర్ లీకేజీలను అరికడతాం అన్నారు.
ఇంటిని నడిపించే గృహిణికి ఎన్నో కష్టాలు ఉంటాయి. అనారోగ్యంతో ఉన్న పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్దామంటే చేతిలో డబ్బు ఉండదు. పిల్లలకు స్కూల్ ఫీజు చెల్లించేందుకు ఒక్కోసారి డబ్బులు ఉండవు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల కష్టాలు తొలగిపోతాయి. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2,500 వేస్తాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. జీఎస్టీ వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయి. వస్తువుల ధరలు తగ్గాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మార్పు రావాలి. కాంగ్రెస్ రావాలి. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ దగ్గరపడిరది అని అన్నారు.













