తెలంగాణలో ప్రియాంక గాంధీ 2 రోజుల ఎన్నికల ప్రచారం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ రెండు రోజుల పాటు పార్టీ తరపున తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. శుక్ర, శనివారాల్లో అంటే 24, 25 తేదీల్లో ప్రియాంక గాంధీ పర్యటన ఉంటుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆమె పర్యటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. ప్రియాంక తొలి సభ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తిలో జరగనుంది. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్నాబాద్‌లో, సాయంత్రం 3 గంటలకు కొత్తగూడెంలో ప్రియాంక ప్రచార ర్యాలీ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థిగా బరిలోకి దిగిన కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా ప్రియాంక ప్రచారం చేయనున్నారు. ఇక 24వ తేదీ రాత్రి ఖమ్మంలో ప్రియాంక విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 25వ తేదీ ఉదయం 11 గంటలకు పాలేరు, 1.30 గంటలకు సత్తుపల్లి, 2.40 గంటలకు మధిర నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికల ప్రచార సభల్లో ప్రియాంక పాల్గొంటారు. ఆ సభతో తెలంగాణలో ఆమె పర్యటన ముగుస్తుంది. సాయంత్రానికి విజయవాడ చేరుకొని గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.













