తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ .. కేసీఆర్
తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరంగల్‌లో ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో ఇవాళ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని అన్నారు. రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి కేసీఆర్‌ను, ఇక్కడి మంత్రులను తిట్టి వెళ్తారు. అలా తిట్టిన వారే ఢిల్లీ లో అవార్డులు ప్రకటిస్తారు. రాజకీయాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు విమర్శిస్తున్నారు.
ఉద్యమ సమయంలో నేను ఏదైతే ప్రజలకు పదేపదే చెప్పానో అది వందకు వంద శాతం ఈరోజు సాకారం అవుతోంది. చాలా అద్భుతంగా గొప్ప ధనిక రాష్ట్రంగా ఉంటామని ఉద్యమ సమయంలో చెప్పాను. నేను ఉద్యమం ప్రారంభించినప్పుడు పుట్టిన పిల్లలకు ఇప్పుడు ఫలితాలు అందుతున్నాయి. గతంలో తెలంగాణలో ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు ఐదు మాత్రమే ఉండేవి. ఇప్పుడు రాష్ట్రంలో వైద్య కళాశాల సంఖ్య 17కు చేరింది. రాష్ట్రంలో 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 6500కు పెరిగాయి. వైద్య విద్య కోసం మన విద్యార్థులు ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.













