సాధ్యం కాని హామీలు ఇవ్వడంలో ఆయన ముందు
జెండా ఏదైనా కేసీఆర్ను గద్దె దింపడమే తమ ఎజెండా అని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలను ఇంటికి పంపించడమూ తమ లక్ష్యమన్నారు. పాలేరు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, దీంతో వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. ఉద్యోగ నియామక విషయంలో తీసుకున్న చర్యలేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేదొకటి, చేసేదొకటి అని విమర్శించారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడంలో ఆయన ముందుంటారన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలను మసిపూసి మారేడు కాయలు చేసే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. పొద్దుగూకాక ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుకుంటుందని గుర్తు చేశారు.













