కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు పాకింది.. సంకల్ప్ సభలో మోదీ
కేసీఆర్ ప్రభుత్వం అంటే అత్యంత అవినీతి ప్రభుత్వం అని, ఇప్పుడు వారి అవినీతి ఢిల్లీకి కూడా పాకిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణానికి, రూ.2,147 కోట్లతో జగిత్యాల`కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనులకు, రూ.3,441 కోట్లతో మంచిర్యాల`వరంగల్ జాతీయ రహదారి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. వరంగల్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగిస్తూ దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని అన్నారు.
తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తయింది. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని అన్నారు. అభివృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమి. రూ.6 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నాం. దేశాభివృద్ది కోసం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నాం. అనేక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్`ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయి. కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుంది. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాం. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నాం అని అన్నారు.
భద్రకాళి, సమ్మక్క, సారలమ్మ, రుద్రమదేవీలను ప్రధాని స్మరించుకున్నారు. సమ్మక్క`సారలమ్మ పౌరుషానికి ప్రతీకలని తెలిపారు. రాణి రుద్రమ పరాక్రమానికి చిరునామా అయిన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోంది. అత్యంత అవినీతి ప్రభుత్వం. కేసీఆర్ సర్కారు అవినీతి ఢిల్లీ వరకూ పాకింది. కేంద్రం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతుంటే మరి రాష్ట్రం ఏం చేస్తోంది. అభివృద్ది కోసం కొన్ని రాష్ట్రాలు కలిసి పని చేస్తుంటాయి. తొలిసారి అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పని చేయడం దౌర్భాగ్యం. ఇలాంటి అవినీతి చూసేందుకేనా యువత ఆత్మబలిదానాలు చేసింది అంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్ సర్కారు పనిగా పెట్టుకుందని మోదీ విమర్శించారు.













