బీజేపీని గెలిపించండి.. మీ ఆకాంక్షలను నేరవేరుస్తాం : మోదీ

కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని తెలిపారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజల కలలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ చిదివేశాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నగిలిపోయింది. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ఈ ఐదేళ్లు చాలు అని అన్నారు. బీజేపీని గెలిపించండి.. మీ ఆకాంక్షలను నేరవేరుస్తాం. మీ అభివృద్ది కోసం నేను రాత్రి, పగలూ పనిచేస్తాను. మా పార్టీ ఎంపీలను భారీ సంఖ్యలో గెలిపిస్తే అప్పుడు కాంగ్రెస్ ఆటలు సాగవు. ఆ పార్టీ గరీబీ హఠావో అని దశాబ్దాల క్రితమే నినాదం ఇచ్చింది. కానీ పేదరికం పోయిందా? కాంగ్రెస్ పాలన అంతా మోసం, దోపిడీ మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది. బీజేపీకి పూర్తి మెజారిటీ ఇచ్చిన తర్వాతే దేశంలో మార్పు మొదలైంది. మార్పునకు గ్యారంటీ మోదీ గ్యారంటీ మాత్రమే. నేను నా కోసం ఒక్కరోజు కూడా వినియోగించుకోలేదు. రేయింబవళ్లు 140 కోట్ల ప్రజల కోసమే పని చేస్తున్నాను. ఆర్టికల్ 370 అయోధ్య రామాలయం నిర్మాణం ఇందుకు కొన్ని ఉదాహరణలు అని తెలిపారు.
తెలంగాణలో ప్రజల కోసం కోటి బ్యాంకు ఖాతాలు తెరిచాం. కోటిన్నర మందికి బీమా కల్పించాం. 67 లక్షల మందికి ముద్రా రుణాలు అందించాం. 89 లక్షల మంది ఆయుష్మాన్ పథకం కింద లబ్ది పొందారు. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రైతులకే ఎక్కువ మేలు జరిగింది. కాంగ్రెస్ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుతోంది. గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిరచేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది. యాదాద్రిలో చిన్న పీట వేసి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా అవమానించింది. దళిత బంధు పేరిట కేసీఆర్ మోసం చేశారు. దళితుడినే తెలంగాణ తొలి సీఎం చేస్తామని మాట తప్పారు. కొత్త రాజ్యాంగం అవసరమంటూ అంబేడ్కర్‌ను అవమానించారు అని విమర్శించారు.