ఎదురుపడ్డ అసదుద్దీన్, మాధవీలత.. రెచ్చిపోయిన కార్యకర్తలు

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నియోజకవర్గంలోని మీర్‌పేట పోలింగ్ బూత్‌లో ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇద్దరూ ఒకే టైంలో ఓటు వేయడానికి వెళ్లడంతో ఎదురుపడ్డారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున గుమిగూడి ఇద్దరి వాహనాలను చుట్టుముట్టారు. తమ అభ్యర్థులకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అయితే కొద్ది సేపటికే అక్కడకు చేరుకున్న పోలీసులు.. కార్యకర్తలను వెనక్కి నెట్టి అభ్యర్థుల వాహనాలు వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేయడమే కాకుండా భారీ బందోబస్తు మధ్య ఇద్దరినీ అక్కడి నుంచి పంపించివేశారు. కాగా.. పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఓ ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే.