ప్రజాసేవకే రాజకీయాల్లోకి వచ్చా.. మరేదో కారణంతో కాదు
సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, డబ్బు కోసమో, మరేదో కారణంతో కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వరంగల్ నిట్లో వసంతోత్సవం (స్ప్రింగ్స్ప్రీ) కార్యక్రమాన్ని నిట్ సంచాలకుడు ఆచార్య ఎన్.వి.రమణారావుతో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. నేను కళాశాలలు, యూనివర్సిటీలకు వెళ్లలేదు. అయినా నిత్య విద్యార్థిని. ప్రతికూల పరిస్థితులను చూసి వెనకడుగు వేయొద్దు. నేడు విఫలమైనా రేపు తప్పకుండా గెలిచి తీరుతాం. పేటెంట్లు వచ్చినంత మాత్రన ఆవిష్కరణ గొప్పది కాదు. సమాజానికి అది ఎంతవరకు మేలు చేస్తుందన్నదే ముఖ్యం. లక్షల మంది కలరా బాధితుల ప్రాణాలు నిలిపిన, నిలుపుతున్న ఓఆర్ఎస్ ద్రావణాన్ని కనుగొన్న డాక్టర్ దిలీప్ లాంటి వారు చేసిన ఆవిష్కరణలు గొప్పవి అని స్పష్టం చేశారు.













