మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు
పార్టీకి ద్రోహం చేసిన వారు చరిత్ర హీనులవుతారని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో జరిగిన టీఆర్ఎస్ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని వదిలి వెళ్లిన వారు కాలగర్భంలో కలిసిపోయారని చెప్పారు. పార్టీని నమ్ముకున్న వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఇతర పార్టీల్లాగా తాము మాట్లాడలేం మాట్లాడితే చాలా భయంకరంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే కార్యకర్తలకు కేసీఆర్ న్యాయం చేస్తారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. ప్రతిపక్షాలను ప్రజలు నమ్మరని, తమవెంటనే ఉన్నారని కమలాకర్ పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి చేపట్టి మరింత పటిష్టంగా మార్చాలని సూచించారు. సభ్యత్వ రుసుం చెల్లించిన వారికి పార్టీపై హక్కు ఉంటుందన్నారు. పండుగ వాతావరణంలో సభ్యత్వ సేకరణ జరుపాలని కార్యకర్తలను కోరారు.













