చారిత్రక సౌధంలో విధి నిర్వహణ గొప్ప అనుభవం : అమెరికా కాన్సులేట్ జనరల్
చారిత్రకసౌధం పైగా ప్యాలెస్‌తో అమెరికా కాన్సులేట్ లీజు ముగిసింది. అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పైగా ప్యాలెస్‌ను హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్‌కు లాంఛనంగా అప్పగించారు. లీజు ముగిసినట్లు ధ్రువీకరణ పత్రాలపై ఇరువురు అధికారులు సంతకాలు చేశారు. కాన్సులేట్ సుమారు 16 సంవత్సరాల పాటు పైగా ప్యాలెస్ నుంచే సేవలను అందించింది. వందల ఏళ్లనాటి అద్భుతమైన భవనాన్ని కాన్సులేట్ కార్యాలయానికి లీజుకు ఇవ్వడం పట్ల జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
2006 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా నగరంలో అమెరికా కాన్సులేట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2007 జులైలో కాన్సులేట్ ఏర్పాటుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అమెరికా ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. కాన్సులేట్ ఏర్పాటు కోసం నగరంలోని పలు భవనాలను పరిశీలించిన అమెరికా అధికారులు చివరకు పైగా ప్యాలెస్‌ను ఎంపిక చేశారు. అద్దె ప్రాతిపాదికన ప్రభుత్వం ఈ ప్యాలెస్‌ను అప్పగించింది. 2008 అక్టోబరు నుంచి కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా ప్రజలకు సైతం హైదరాబాద్ నుంచే వీసా సేవలు లభిస్తున్నాయి. కాన్సులేట్ కార్యకలాపాలు 16 ఏళ్లుగా పైగా ప్యాలెస్ నుంచే కొనసాగాయి.













