ప్రసిద్ధ గుస్సాడీ కళాకారుడు పద్మశ్రీ కనకరాజు ఇకలేరు

గిరిజనుల సంప్రదాయ గుస్సాడీ నృత్యానికి జీవం పోసి, భావితరాలకు అందిస్తున్న పద్మశ్రీ కనకరాజు (94) కన్నుమూశారు. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయికి చెందిన కనకరాజు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ సభ్యులు వివిధ ఆసుపత్రుల్లో చూపిస్తున్నారు. వారం రోజుల నుంచి పరిస్థితి విషమంగా మారడంతో శుక్రవారం సాయంత్రం ఇంటి వద్దే చనిపోయారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గుస్సాడీకి కనకరాజు చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021 నవంబరు 9న ఆయనకు పద్మశ్రీ ప్రకటించి, అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రదానం చేసింది.