ఎన్ఆర్ఐ దాతృత్వంతో.. చిన్నారి మహాన్ కు శస్త్రచికిత్స

ప్రవాస భారతీయుడి చేయూతతో చిన్నారి మహాన్‌కు హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. తెలంగాణలోని హునుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్‌కు చెందిన సిలువేరు వెంకటేశ్`అశ్విత దంపతుల రెండో కుమారుడు మహాన్ ( ఏడాది) తలకు ఏర్పడిన పెద్ద కణితి ప్రాణాంతకంగా మారింది. రూ.లక్షల ఖర్చుతో బాలుడికి శస్త్రచికిత్స చేయించేందుకు స్తోమత లేకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వారి దీన స్థితిపై అమెరికాలో ఉంటున్న ఒక ప్రవాస భారతీయుడు స్పందించారు. తన పేపు చెప్పుకొనేందుకు ఆయన ఇష్టపడలేదు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన భార్య, బావమరిది ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. ఎంత ఖర్చయినా భరిస్తామని, బాలుడికి శస్త్ర చికిత్స చేయాలన్నారు. అప్పటికప్పుడు రూ.2.5 లక్షలను ఆసుపత్రిలో చెల్లించారు. బాలుడి తల్లిదండ్రుల ఖర్చుల నిమిత్తం మరో రూ.10 వేలు అందజేశారు. దీంతో బాలుడికి శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. ప్రవాస భారతీయుడి దాతృత్వంతో తమ కుమారుడికి శస్త్రచికిత్స జరిగిందంటూ మహాన్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.