తెలుగు రాష్ట్రాల్లో ‘హోళీ’ ఆంక్షలు
కోవిడ్ సమయంలో హోళీ రావడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు హోలీపై దృష్టి సారించాయి. హైదరాబాద్ నగరంలో హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈవెంట్లకు ఎంత మాత్రమూ అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పారు. గేటెడ్ కమ్యూనిటీల్లో ఎలాంటి వేడుకలూ నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఇళ్లలోనే హోలీ వేడుకలు జరుపుకోవాలని, గుంపులు గుంపులుగా హోలీ జరుపుకోవద్దని సూచించారు. ఇళ్లలో ఆడినా, కరోనా నిబంధనలను పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. ఇక హోలీ పండుగపై ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా స్పందించారు. హోలీ పండుగను రాష్ట్రంలో నిర్వహించకూడదని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయమని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇంట్లోనే ఉండి, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగ జరుపకోవాలని సూచించారు. అర్హులైన వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకోవాలని హరిచందన్ సూచించారు.













