తెలంగాణ ప్రభుత్వానికి భారీ జరిమానా
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ సుమారు రూ.900 కోట్ల జరిమానా వేసింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ సహా అనేక ఇతర అనుమతులు లేవని, నిర్మాణాలను నిలుపుదల చేయాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని తెలిపింది. ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం వ్యయంలో 1.5 శాతం జరిమానా విధిస్తూ ఎన్జీటీ చెన్నై బెంచ్ తీర్పు వెలువరించింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారంటూ కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై కర్నూలుకు చెందిన చంద్రమౌళేశ్వర రెడ్డి, ఏపీ ప్రభుత్వం అనుబంద పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ చేపట్టిన ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.













