తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటు ?

తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్‍ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలిసింది. భారతదేశ ఆర్థిక పితామహుడు, బహుభాషా కోవిదుడు, అపర చాణుక్యుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నట్టుగా సమాచారం. ఈ నెల 28వ తేదీన పీవీ వందో జయంతి పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా హుజురాబాద్‍ను కొత్త జిల్లాగా ప్రకటించడంతో పాటు పీవీ పేరును ఆ జిల్లాకు పెట్టాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 33 జిల్లాలు ఉండగా కొత్త జిల్లా ప్రకటిస్తే మొత్తం రాష్ట్రంలో 34 జిల్లాలను ఏర్పాటు చేసినట్టు అవుతుంది. దీనిపై త్వరలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నట్టుగా సమాచారం. ఇప్పటికే చాలా ఏళ్లుగా హుజురాబాద్ నియోజకవర్గంలో పెండింగ్‍లో ఉన్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిసింది.