‘కాళేశ్వరం’ వైఫల్యాలపై రిపోర్ట్…
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ లోపాల కారణంగా కుంగిందని జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ స్పష్టం చేసింది.. క్వాలిటీ కంట్రోల్ విభాగం కఠినంగా లేకపోవడం వల్లనే నిర్మాణంలో లోపాలు తలెత్తినట్టు కనిపిస్తోందని చెప్పింది. ప్లానింగ్ చేసిన విధంగా డిజైన్ జరగలేదని, డిజైన్ చేసినట్లు నిర్మాణం చేపట్టలేదని వెల్లడించింది. కుంగిన ఏడో బ్లాక్‌ను మరమ్మతు చేయడానికి కుదరదని, మొత్తం బ్లాక్‌ను పునాదుల నుంచి పునర్నిర్మించాలని సూచించింది. ప్రస్తుతం ఏర్పడిన సమస్యను పరిష్కరించేవరకు బ్యారేజీని ఉపయోగించడానికి అవకాశం లేదని తెలిపింది. ఒకవేళ నిర్మాణం మొత్తం ఇలాగే జరిగిఉంటే.. ఇతర బ్లాక్‌లు కూడా వైఫల్యం చెందే అవకాశం ఉందని హెచ్చరించింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగి పిల్లర్లు దెబ్బతిన్న నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన డ్యాం సేఫ్టీ నిపుణుల బృందాన్ని కేంద్రం పంపింది. ఈ బృందం 24న మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి, 25న నీటిపారుదలశాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులతో సమావేశమై చర్చించింది. నీటిపారుదలశాఖ నుంచి అదనపు సమాచారాన్ని కోరి తీసుకొన్న నిపుణుల బృందం ఇందుకు సంబంధించిన 43 పేజీల నివేదికను కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శికి సమర్పించింది. జల్‌శక్తి కార్యదర్శి సంజయ్ కుమార్ సిబల్ తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు పంపారు.
నిపుణుల బృందం నివేదిక
‘డ్యాం సేఫ్టీ కమిటీ 20 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కోరింది. మొత్తం వివరాలు ఇవ్వకుండా 11 అంశాలకు సంబంధించి మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర
ప్రభుత్వం ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉంది. అక్టోబరు 29లోపు మిగిలిన వివరాలు అందించకపోతే బ్యారేజి నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను
చేయించలేదని భావించాల్సి వస్తుంది.. ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్పెక్షన్ నివేదికలు, నాణ్యతానివేదికలు, థర్డ్‌పార్టీ నాణ్యత పర్యవేక్షణ నివేదికలు, వర్షాకాలం ముందు..తర్వాత నది కొలతలను చూపించే ముఖ్యమైన స్ట్రక్చరల్ డ్రాయింగ్కు సంబంధించిన వివరాలను అందజేయలేదు. ఫలితంగా ఈ సమాచారానికి
అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను నిర్వహించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తమవద్దనున్న సమాచారాన్ని ఇవ్వకుంటే అది డ్యాం సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చు’ అని రాష్ట్ర అధికారులకు తెలిపామని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
నాలుగు అంశాల్లో వైఫల్యం
మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రాథమికంగా 4 కారణాలున్నాయని కమిటీ తెలిపింది. ‘ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో వైఫల్యం, బ్యారేజి పునాది కింద ఇసుక కొట్టుకుపోవడం వల్ల సపోర్టు బలహీనపడింది. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్ఠత, సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజి లోడ్వల్ల ఎగువన ఉన్న కట్ ఆఫ్ వాల్ సీకెంట్ ఫైల్స్ వైఫల్యం చెంది ఉండొచ్చు. బ్యారేజీని తేలియాడే నిర్మాణంగా డిజైన్ చేశారు. కానీ స్థిరమైన కట్టడంగా నిర్మించారు. వీటిని పరిశీలిస్తే ప్లానింగ్ చేసినట్లుగా డిజైన్ లేకపోవడం, డిజైన్ చేసినట్లు నిర్మాణం జరగలేదని స్పష్టమవుతోంది. 2019లో బ్యారేజీని ప్రారంభించినప్పటి నుంచి నిర్వాహకులు సిమెంట్ కాంక్రీటు దిమ్మెలను, లాంచింగ్ అప్రాన్లను సరిగా పరిశీలించలేదు. మెయింటెనెన్స్ చేపట్టలేదు.
ఈ విషయంలో నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడి వైఫల్యానికి దారి తీసింది. ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత ఆప్రాన్ ప్రాంతాన్ని, స్ట్రక్చర్లను పరిశీలించాలి. దిగువన నాన్ లాంచింగ్ ప్రాంతాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఏవైనా సాధారణ సమస్యలు కనిపిస్తే తనిఖీలు నిర్వహించాలని కేంద్ర డ్యాం సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీకి పలుమార్లు సూచించినప్పటికీ.. వాటిని పాటించలేదని అర్థమవుతోంది. ఇది పెద్ద తప్పిదం. డ్యాం సేఫ్టీ చట్టంలోని అనేక ఇతర నిబంధనలను కూడా పాటించలేదు.’ పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ఉండటానికి, దెబ్బతిన్న బ్లాక్‌ను పునరుద్ధరించేవరకు తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిటీ
సూచించింది. రిజర్వాయర్‌లో నీటిని నింపకూడదని, ఒకవేళ నింపితే ఇది పైపింగ్ సమస్యను మరింత తీవ్రం చేస్తుందని.. గ్రాంట్రీ క్రేన్ ఆపరేట్ చేయరాదని సూచించింది.
మిగిలిన రెండు బ్యారేజీలు కూడా..
‘కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డకు ఎగువన నిర్మించిన రెండు బ్యారేజీలు అన్నారం, సుందిళ్లకు కూడా ఒకే రకమైన డిజైన్లు, నిర్మాణ పద్ధతులు అవలంబించారు. కాబట్టి ఇవి కూడా మేడిగడ్డ లాగానే వైఫల్యం చెందడానికి ఆస్కారం ఉంది. అన్నారం బ్యారేజీలో ఇప్పటికే బాయిలింగ్ ఏర్పడింది. ఇది వైఫల్యానికి ముందస్తు దశ. ఈ రెండు బ్యారేజీలను త్వరగా పరిశీలించి ఏమైనా సమస్యలున్నాయేమో చూడాలి. కమిటీ నివేదికను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసుకోవాలి. వైఫల్యానికి గల కారణాలపై సమగ్రంగా అధ్యయనం చేపట్టాలి. ఇన్వెస్టిగేషన్, తీసుకోబోయే చర్యల గురించి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి సమాచారం ఇవ్వాలి. మిగిలిన రెండు బ్యారేజీల విషయంలో కూడా ఇదేరకమైన చర్యలను తీసుకోవాలి’ అని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికలో పేర్కొంది.













