అమెరికన్ వర్సిటీతో ములుగు అటవీ కాలేజీ ఒప్పందం
అటవీ విద్య, పరిశోధనలకు సంబంధించి ములుగులోని ఫారెస్ట్ కాలేజీ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) అధికారులు, అమెరికా ఆబర్న్ యూనివర్సిటీ అధికారుల మధ్య ఒప్పందం కుదరనున్నది. అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో నేడు ఒప్పందపత్రాలపై సంతకాలు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వర్సిటీని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ అరణ్యభవన్ వేదికగా అమెరికాలోని ఆబర్న్ వర్సిటీ అధికారులతో విద్యాసంబంధ విషయాలపై అటవీశాఖ అధికారులు ఒప్పందం చేసుకోనున్నారు. అడవులు, పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని అటవీ విద్య, మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకొంటున్నట్టు అటవీశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం (కెనడా) సేవలు పొందేందుకుగాను ఆ వర్సిటీ ప్రతినిధులతో కూడా అటవీశాఖ చర్చలు జరుపుతున్నది.













