మెట్రో ముహూర్తం ఖరారైంది
మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28వ తేదీన మద్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మియాపూర్ నుంచే మెట్రో రైలును ప్రారంభించేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు రూట్‌మ్యాప్‌ను పోలీస్ యంత్రాంగం ఖారారు చేసినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఈ నెల 28న విమానంలో బేగంపేటకు, అక్కడి నుంచి మియాపూర్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో మెట్రో స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అక్కడే మెట్రో ఫైలాన్‌ను ప్రారంభిస్తారు. మియాపూర్‌లో పచ్చజెండా ఊపిన తర్వాత అదే రైలుతో ప్రధాని మోదీ 13 కిలో మీటర్ల దూరంలో ఉండే అమీర్‌పేట వరకు ప్రయాణించనున్నారు. అమీర్‌పేట ఇంటర్చేంజ్ స్టేషన్‌ను కొన్ని నిమిషాలపాటు పరిశీలించిన తర్వాత అదే మార్గంలో తిరిగి మియాపూర్ చేరుకునేలా మెట్రో అధికారులు రూట్ మ్యాప్ సిద్దం చేశారు. ఈ ప్రయాణ సమయంలో మెట్రో విశేషాలను అధికారులు ఆయనకు వివరిస్తారు. మియాపూర్‌లో జరిగే సభలో ప్రసంగించిన తర్వాత మోదీ మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగే సదస్సుకు వెళతారు. ఈ మేరకు పోలీసు అధికారులు హెలీప్యాడ్ స్థలాన్ని ఖారు చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే ఎయిర్‌ఫోర్స్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ట్రాఫిక్, మెట్రో, ఎల్అండ్టీ అధికార యంత్రాంగం పలుమార్లు మియాపూర్ స్టేషన్, మెట్రో కారిడార్ ప్రాంతాన్ని సందర్శించి, ఓకే చేసింది. మెట్రో రైలు ప్రయాణాన్ని నగరవాసులకు 28నుంచే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ప్రధాని మోదీ ప్రారంభించి వెళ్లిన 2గంటల తర్వాత ప్రజలకు మెట్రో రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 30 కిలో మీటర్ల దూరం సిద్ధమవుతుండడంతో రైళ్లు నడిపేందుకు అన్ని పనులు పూర్తి చేస్తున్నారు.













