నివేదిక రాకముందే.. పాపాల పుట్ట అంటే ఎలా? : కవిత
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నివేదిక రాకముందే పాపాల పుట్ట అని ఎలా వర్ణిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల విషయంలో ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అమలు కానీ హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. లబ్ధిదారులకు ఇంకా పింఛన్లు, రైతుబంధు రాలేదని ఆరోపించారు. ఉద్యమం నుంచి ఓరుగల్లు జిల్లా బీఆర్ఎస్కు పెట్టని కోటగా ఉందని మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడ ఓడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త కాన్వాయ్‌లను గత ప్రభుత్వం దాచి పెట్టిందన్న ఆరోపణపై కవిత స్పందించారు. నాయకుల భద్రత దృష్ట్యా పోలీసుశాఖ వాహనాలను సమకూరుస్తుందని తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో బొగ్గుగని కార్మిక సంఘం పోటీ చేయలేదని, అయినా తాము ఓడిపోయామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.













