కడియం శ్రీహరి, రాజయ్య మధ్య దోస్తీ..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకోసం అందరికంటే ముందే అభ్యర్థులను అనౌన్స్ చేసింది అధికార బీఆర్ఎస్ పార్టీ. ఇలా అనౌన్స్ చేయడం ద్వారా ప్రచారంకోసం అభ్యర్థులకు తగినంత సమయం దొరుకుతుందనేది కేసీఆర్ ఆలోచన. 115 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేయగా ఏడు చోట్ల సిట్టింగులకు సీట్లు నిరాకరించారు కేసీఆర్. వాళ్ల స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం కల్పించారు. ఇది అసంతృప్తి రాజేసింది. సిట్టింగును కాదని వేరే వాళ్లకు టికెట్ కేటాయిస్తారా.. అంటూ పలువురు నేతలు రగిలిపోతున్నారు. అలాంటి వారిలో ముందున్నారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య.
స్టేషన్ ఘన్ పూర్ నుంచి వరుసగా ఎన్నికవతూ వస్తున్నారు రాజయ్య. 2009 నుంచి ఆయన ఇక్కడ నాలుగు సార్లు విజయం సాధించారు. దాన్ని ఆయన కంచుకోటగా తీర్చిదిద్దుకున్నారు. 2014లో రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు కేసీఆర్. వైద్య ఆరోగ్య శాఖ అప్పగించారు. అయితే రాజయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించారు. అయినా 2018లో మళ్లీ ఆయనకు సీటిచ్చారు. రాజయ్య మళ్లీ గెలిచారు. అయితే ఈసారి కేబినెట్ లో స్థానం దక్కలేదు. ఈ అసంతృప్తి రాజయ్యలో మొదటి నుంచి ఉంది. ఇదే సమయంలో రాజయ్య తనను వేధిస్తున్నారంటూ సర్పంచ్ నవ్య మీడియా ముందుకొచ్చారు. ఇది పెద్ద దుమారమే రేపింది.
ఎన్నికల ముంగిట రాజయ్యకు సర్పంచ్ నవ్య వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. నవ్య ఎంతకూ వెనక్కు తగ్గకపోవడంతో రాజయ్య తలొగ్గి క్షమాపణ చెప్పారు. గతంలో కూడా రాజయ్యపై ఇలాంటి ఆరోపణలు రావడంతో కేసీఆర్ ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో రాజయ్య బద్ధశతృవైన కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. గతంలో రెండు సార్లు స్టేషన్ గన్ పూర్ నుంచి శ్రీహరి నెగ్గారు. తనను కాదని శ్రీహరికి టికెట్ ఇవ్వడంపై రాజయ్య మండిపోయారు. తనకు టికెట్ దక్కలేదనే ఆవేదనతో అంబేద్కర్ విగ్రహం ఎదుట బోర్లాపడి భోరున ఏడ్చేశారు. కేసీఆర్ దూతగా వెళ్లిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసేందుకు కూడా రాజయ్య అంగీకరించలేదు.
రాజయ్య వ్యవహారం పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. ఎన్నికల ముంగిట ఏ ఒక్కరినీ వదులుకోకూడదని భావిస్తున్న కేసీఆర్.. రాజయ్య, శ్రీహరి మధ్య సయోధ్య కుదర్చాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేటీఆర్ కు అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన కేటీఆర్.. వాళ్లిద్దరినీ పిలిపించి మాట్లాడారు. శ్రీహరికి సపోర్ట్ చేసేందుకు రాజయ్య అంగీకరించారు. సీటు రానందుకు బాధపడొద్దని, తప్పకుండా మరో పదవి ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. మరి ఈ సయోధ్య వర్కవుట్ అవుతుందా.. శ్రీహరికి రాజయ్య సపోర్ట్ చేస్తారా.. ఆయన గెలుపునకు కృషి చేస్తారా.. అనే ప్రశ్నలు ఇప్పటికీ ఉన్నాయి. వీటి జవాబులు దొరకాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.!













