తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ… బీజేపీ నేతలు ఇక్కడి
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను, అభివృద్ధి పనులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైసలివ్వకున్నా, అవార్డులు ఇస్తుంది తెలుసా? అని తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ బీజేపీ నేతలు ఇక్కడి అభివృద్ధిపై విషం చిమ్మే మాటలే చెబుతున్నారని మండిపడ్డారు. పదే పదే అవే పచ్చి అబద్దాలు వల్లెవేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడి నేతలు రాసిచ్చిన పాత స్క్రిప్టునే ఎన్నిసార్లు చదువుతున్నారని ప్రశ్నించారు. నడ్డా ఇది కేసీఆర్ అడ్డా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందా? రెండు పడక గదుల ఇళ్ల కోసం మేం రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. వీటికి కేంద్రం కొసిరి కొసిరి ఇచ్చింది కేవలం రూ.1200 కోట్లే. కేసీఆర్ రైతుబంధును కాపీ కొట్టి పెట్టిన కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధిలో రైతులకు షరతులు విధించడం సిగ్గు చేటు అన్నారు. ధరణిని రద్దు చేసి మళ్లీ వీఆర్వో వ్యవస్థ తెచ్చి రైతులను గోస పెడదామనే ఆలోచన బీజేపీది. కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని రైతులకు ఆసరాగా నిలబడితే బీజేపీ ఆరిగోస పెడుతోంది. పేదలు, రైతులు రెండు కళ్లుగా పని చేస్తున్న కేసీఆర్ని జైల్లో పెడతారా? పంచభూతాలను అమ్మకానికి పెట్టి, దేశ సంపద మిత్రులకు దోచి పెడుతున్న నరేంద్ర మోదీని ఎన్ని సార్లు జైల్లో పెట్టాలి? అని ప్రశ్నించారు.













