పాక్ తో కాదు.. అమెరికా, చైనాతో : మంత్రి కేటీఆర్
అభివృద్ధిలో అమెరికా, చైనాతో పోటీపడాలి కానీ పాకిస్థాన్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌తో కాదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గచ్చిబౌలిలో ఆటోమొబైల్ డిజైనింగ్ సంస్థ జెడ్ఎఫ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటికైనా హలాల్, హిజాబ్ వంటి వివాదాలు కాకుండా ఉద్యోగాల కల్పన, ఆదాయం పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణలో గడిచిన 8 ఏళ్లలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ సంస్థల ఏర్పాటు, అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు, నిపుణులైన మానవ వనరులు, ప్రశాంత వాతావరణం అంతర్జాతీయ ఐటీ సంస్థలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. జడ్ఎఫ్ ఇండియా హెడ్ కేవీ సురేశ్ మాట్లాడుతూ 2007లో ప్రారంభించిన తమ సంస్థలో ప్రస్తుతం 2900 మంది ఉద్యోగులున్నారని, రెండేళ్లలో మరో 3 వేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు.













