బరాబర్ మాది కుటుంబ పాలనే : మంత్రి కేటీఆర్
ముమ్మాటికి మాది కుటుంబ పాలనే అని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రూ.125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ను విమర్శించేందుకు విపక్షాలకు కారణం దొరకట్లేదు. ఏ తప్పు దొరక్క కుటుంబ పాలన అని కేసీఆర్ను విమర్శిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి చెబుతున్నా మాది కుటుంబ పాలనే అని బరాబర్ చెబుతున్నా అని కేటీఆర్ స్పష్టం చేశారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే అని అన్నారు. ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామినే. రైతులందరికీ పెద్దన్నలాగా కేసీఆర్ అండగా ఉన్నాడు. ఆసరా పెన్షన్లతో వృద్దులను కడుపులో పెట్టుకున్నాడు. కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ పథకాలకు పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ మేనమా అయిండు. కేసీఆర్ కిట్ పథకం అమలుతో సర్కార్ దవాఖానాలో ప్రవాసల కోసం క్యూ కడుతున్నారు. గురుకులాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ విద్యార్థులను తయారు చేస్తున్నామని తెలిపారు.













