దివ్యాంగుల మొహాల్లో చిరునవ్వు చూస్తేనే మాకు ఆనందం : కేటీఆర్
పేదరికంలో ఉండే పేదలు, ఇతర శారీరక ఇబ్బందులు ఉండే దివ్యాంగులకు బాసటగా, ఆసరాగా నిలబడాలన్నదే తమ ప్రభుత్వ లక్షమని తెలంగాణ మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వును చూసినప్పుడే తమకు సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో జరిగింది. దీనికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. 24 కోట్ల 38 లక్షలతో 16,600 మంది దివ్యాంగులకు ఉచితంగా సహాయ పరికరాలు పంపిణీ చేయడం సంతోషాన్ని కలిగించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
నాలుగైదు నెలల కిందట దివ్యాంగుల సమస్యల పట్ల సమావేశం నిర్వహించి, కొత్త ఆవిష్కరణలు రూపొందిచాలని ఛాలెంజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అందులోని ఆవిష్కరణలను కొన్నింటిని దివ్యాంగులకు అందిస్తున్నామని కేటీఆర్ వివరించారు. దివ్యాంగుల కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను అందజేస్తున్నామని, నైపుణ్య శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో దివ్యాంగులకు పెన్షన్ల కింద 500 రూపాయలిస్తే, తమ ప్రభుత్వం మాత్రం 3016 రూపాయలను ఇస్తోందని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో కూడా 5 శాతం ఇండ్లను దివ్యాంగులకు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ నిబంధన అన్ని జిల్లాల్లో అమలయ్యే విధంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని కేటీఆర్ తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ కింద దివ్యాంగుల వివాహాలకు 1,25,145 చొప్పున చెల్లిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.













