ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్టను దెబ్బ తీయటమే : హరీశ్ రావు
బీబీసీలో కథనం ప్రసారం అయ్యిందని, ఆ సంస్థలపై దాడులు జరుపుతోన్న కేంద్రం తీరుతో ప్రపంచం ముందు దేశం పరువుపోతోందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. యాదగిరిగుట్టలో రూ.45 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఎంపీ బడుగుల లింగయ్య, స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీతతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ వార్తా కథనంలో తప్పులుంటే వివరణ ఇవ్వాలి కానీ, ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బ తీయటమే అవుతుందని విమర్శించారు. వైద్యారోగ్యంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. త్వరలోనే యాదాద్రి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో మరో 9 వైద్య కళాశాలల ఏర్పాటును త్వరలో చేపడతామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేస్లు ఇస్తే బీజేపీ నేతలు కుట్రలు అంటున్నారని వారిపై విరుచుకుపడ్డారు. ఉద్యోగ ప్రకటనలు ఇస్తే బీజేపీ అధ్యక్షుడు కుట్రలు అంటుంటారు. ఇలాంటి వింత నేతను ఎక్కడైనా చూశామా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ పేరుతో సచివాలయం నిర్మిస్తే దాన్ని కూల్చేస్తామంటున్నారు. పేల్చేటోళ్లు, కూల్చోటోళ్ల చేతికెళ్తే తెలంగాణ మళ్లీ ఆగమవుతుంది. కూల్చేస్తాం. తవ్వేస్తాం అనేది బీఆర్ఎస్ విధానం కాదు. దేవుణ్ని రాజకీయాలను వాడుకునే సంస్కృతి మాది కాదు. బీజేపీ నేతల్లా బీఆర్ఎస్ అబద్దాలు చెప్పాల్సిన పనిలేదు. చేసింది చెప్పుకొన్నా , ప్రజలు బీఆర్ఎస్కే ఓటు వేస్తారు అని అన్నారు.













