దేశంలో ఎవరు చేయలేని పని… కేసీఆర్
ప్రధానికి గుజరాత్ తప్ప ఏ రాష్ట్రం కనిపించడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. హన్మకొండలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బయటకు రావాలని, రాష్ట్రాల్లో తిరిగి కరోనా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. దేశంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రయినా, కేంద్ర మంత్రులైనా కొవిడ్ వార్డులోకి వెళ్లారా అని ప్రశ్నించారు. ఆ పని సీఎం కేసీఆర్ చేశారని, వార్డుల్లోకి వెళ్లి బాధితులకు భరోసా కల్పించారని తెలిపారు.
బీజేపీ నేతలు కేంద్రంలో మాట్లాడి రాష్ట్రానికి టీకాలు తెప్పించాలని డిమాండ్ చేశారు. వరంగల్‌లో కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రిపై విశ్వాసం వల్లే ఇక్కడ రోగులు పెరిగారు. ఎంజీఎంలో కొంత టెక్నికల్ సిబ్బంది కొరత ఉందని, దీంతో వెంటనే ఆ కొరత తీర్చాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్, ఔషధాల కొరత లేదని అన్నారు.
సెంట్రల్ జైలు తరలింపుపై సీఎం మంచి ఆలోచన చేశారు. జైలు వెనుక 23 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. ఎంజీఎంను మాతాశిశు సంరక్షణ కేంద్రంగా మార్చాలని సీఎం సూచించారు అని అన్నారు. వరంగల్‌ను హెల్త్ హబ్‌గా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనని అన్నారు. వరంగల్ ప్రజలు, ప్రజాప్రతినిధులందరి తరుపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు.













