ఇందిరా గాంధీని అవమానించిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు క్షమించరు: మల్లికార్జున ఖర్గే
ఇందిరమ్మను అవమానించిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ను టార్గెట్ చేశాడు. ‘కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అంటున్నారు. ఆ టైంలో అసలు మంచి ఏం జరగలేదు. అలాంటప్పుడు ఆ రాజ్యం ఎవరికి కావాలి?’ అని ప్రశ్నించారు. ‘అసలు ఇందిరా గాంధీ ఆ టైంలో అంత గొప్పగా ఏం జరిగింది? పేదవాళ్లను పేదలుగానే వదిలేశారు. ఎస్సీలు, ఎస్టీలను ఓటుబ్యాంకులుగా వాడుకున్నారు. నిజంగా ఆ టైంలో ఏమైనా చేసి ఉంటే ఇప్పుడు దళితులు, గిరిజనులు ఇలాంటి పరిస్థితిలో ఉండేవారు కాదు’ అని కేసీఆర్ అన్నారు. తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ వ్యాఖ్యలపై ఖర్గే మండిపడ్డారు. ‘అహంకారంతో, అధికార మత్తుతో విర్రవీగుతున్న కేసీఆర్.. ఇందిరా గాంధీని అవమానించాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే న్యాయం, సంక్షేమం, అభివృద్ధి. వీటికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది. ఇంతలా ఇందిరమ్మను అవమానించిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ క్షమించరు’ అని పేర్కొన్నారు.













