ఆ పార్టీ ఖమ్మంలోనే కాదు… తెలంగాణలో గెలవదు
బీజేపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ఆ పార్టీ ఖమ్మంలోనే కాదు తెలంగాణలో ఎక్కడా గెలవదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కులం, మతం పేరుతో రాజకీయాలు చేసి అధికారంలోకి రావాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఖమ్మంపై అన్ని పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, జిల్లాలు కమ్యూనిస్టులకు బలం. కొంతమంది ఏ పార్టీలోకి వెళ్లాలి? ఏం చేయాలి? అనే ధోరణితో ఖమ్మం క్రాస్ రోడ్డులో నిలబడ్డారు. అలాంటి వారిని చేర్చుకునేందుకు కొన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖమ్మంకు పెద్ద పెద్ద వలలు వేసుకుని వస్తున్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం చేశారో ఆయన చెప్పాలి. విభజన హామీల ఊసే అమిత్ షా ఎత్తడం లేదు. ఖమ్మంకు వచ్చే నైతిక హక్కు ఆయనకు లేదు. ఆయన పర్యటనను మేం వ్యతిరేకిస్తున్నాం. తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఏ వర్గానికి ప్రయోజనం కలిగింది? అభివృద్ధి కంటే నేతలను కొనుగోలు చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందన్నారు.













