మంత్రి కేటీఆర్ మామ హరినాథరావు కన్నుమూత.. సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన ఈ నెల 27న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు. అక్యూట్ కరోనరీ సిండ్రోమ్, కార్డియోజెనిక్ షాక్, అనాక్సిక్ బ్రెయిన్ ఇంజ్యూరీతో హరినాథరావు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పార్థివదేహాన్ని రాయదుర్గంలోని వారి నివాసానికి తరలించారు. కేటీఆర్, ఆయన సతీమణి శైలిమా, కుటుంబ సభ్యులు వెంట ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభ, మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ సంతోష్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి సుదర్శన్, సుధీర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, తదితరులు హరినాథరావు భౌతికకాయానికి నివాళులర్పించారు.













