బీఆర్ఎస్ను బద్నాం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం.. శ్వేతపత్రంపై కేటీఆర్ ఫైర్!
తెలంగాణలో బీఆర్ఎస్ దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ పాలనలో పదేళ్లలో జరిగిన ప్రగతిపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా తెలంగాణ భవన్లో ‘స్వేద పత్రం’ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ అప్పు కేవలం రూ.3.17 లక్షల కోట్లేనని, కాంగ్రెస్ చెప్పినట్లు 6.71 లక్సల కోట్లు కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే అప్పులను ఎక్కువ చేసి అబద్ధాలు చెప్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రగతిని, పార్టీని బదనాం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో పేర్కొన్న అప్పుల గురించి ప్రస్తావిస్తూ.. ‘తెలంగాణ మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లనేది కాంగ్రెస్ చెప్తున్న పూర్తి అబద్దం. 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లు ఉండేది. ప్రస్తుతం తెలంగాణ అప్పు 3.17 లక్షలకు చేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, జరిగిన అభివృద్ధిని పోల్చి చూస్తే కాంగ్రెస్కు కనువిప్పు కలుగుతుంది. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాల వల్లనే ప్రత్యేక రాష్ట్రంలో పేదరికం తగ్గుముఖం పట్టి, తలసరి ఆదాయం పెరిగింది. 2013లో తెలంగాణలో పేదరికం 21 శాతం ఉండేది. అది 2023 నాటికి 5 శాతానికి తగ్గింది. 2014లో రూ.1.14 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం.. ప్రస్తుతం 3.17 లక్షలకు చేరింది’ అని కేటీఆర్ వివరించారు.













