వీరుడు ఎక్కడ పుట్టినా.. వీరుడే : మంత్రి కేటీఆర్
వీరుడు దేశంలో ఎక్కడ పుట్టిన వీరుడే అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ట్యాంక్ బండ్‌పై నిర్వహించిన అల్లూరి జయంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ అందరికి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మన్యం వీరుడి జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో కుమ్రం భీమ్ ఈ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం నాటి నిజాం ప్రభువు పై తెగించి పోరాడారని తెలిపారు. తెలుగుజాతిని ప్రభావితం చేసేలా అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులపై దోరోధాత్తంగా పోరాటం సలిపారని వెల్లడించారు. అలాంటి వీరుల స్ఫూర్తితో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. నగరంలోని ఖానామెట్‌లో అల్లూరి భవన నిర్మాణం కోసం మూడెకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించారని తెలిపారు.
అల్లూరి సీతారామరాజు గొప్ప వీరుడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. అల్లూరి జయంతి వేడుకలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతవరకు అధికారికంగా జరుగలేదని ఇదే మొదటిసారన్నారు.













