టీఆర్ఎస్ ను గెలిపిస్తే.. మునుగోడును దత్తత తీసుకుంటా
మునుగోడు ఉప ఎన్నిక ఓ కాంట్రాక్టర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.. ఈ సందర్భంగా చండూరులో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి పనైనా చేశారా? అని ప్రశ్నించారు. ఏ గ్రామానికైనా అభివృద్ధి పనులు కావాలని జిల్లా మంత్రి వద్దకు వెళ్లారా? అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్కు మునుగోడు కష్టం తెలుసని అన్నారు. మునుగోడు పదేళ్ల మందు ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలని కోరారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5 లక్షల బీమా ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
నల్గొండ జిల్లాను పట్టి పీడిరచిన ఫ్లోరైడ్ సమస్యను ప్రధానులు సైతం పట్టించుకోకపోయినా కేసీఆర్ పరిష్కరించారన్నారు. ఇప్పుడు ఉప ఎన్నిక ఎందుకొచ్చిందో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేస్తే, రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారని అన్నారు. ప్రజల అవసరం లేకపోయినా బలవంతంగా రుద్దిన ఎన్నిక ఇది అని అన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు.













