మంత్రి కేటీఆర్‌కు హార్వర్డ్ వర్సిటీ ఆహ్వానం
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరో అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించనున్నారు. అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీలో నిర్వహించే ఇండియా కాన్ఫరెన్స్-2020 కి హాజరుకావాలని నిర్వాహకులు కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. బోస్టన్లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఈ నెల 15, 16 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 20/20 ఫోర్‌సైట్ అనే థీమ్‌తో ఈ సదస్సుకు పలువురు ప్రముఖులను ఆహ్వానించిన నిర్వాహకులు.. భారతదేశంలో స్మార్ట్ సిటీలు అనే అంశంపై మాట్లాడాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను కోరారు. భారత్‌కు చెందిన అంశాలపై అమెరికాలో నిర్వహించే సదస్సుల్లో హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ అతిపెద్దతి. హార్వర్డ్ వర్సిటీ, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఇరు దేశాల ప్రముఖులు, వెయ్యిమంది ప్రతినిధులు హాజరవుతారు.
ముఖ్యంగా అమెరికాలోని యంగ్ ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీ లీడర్లు, వివిధ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ అమెరికన్లు, విద్యార్థులు, పలు వర్సిటీల ప్రొఫెసర్లు హాజరవుతారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్, అరుణ్పూరి, సురేశ్‌ప్రభు, జయంత్‌సిన్హా, అనుపమ్‌ఖేర్, రితేశ్ అగర్వాల్‌ను కూడా ఈ కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించారు.













