నేను చెప్పింది తప్పని నిరూపిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తా
నేను చెప్పింది తప్పని నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వర్నె వద్ద ఆర్అండ్బీ రోడ్డుపై రూ.18కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూత్పూర్ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణకు నిధులివ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పారు. కానీ 8 ఏళ్లలో ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. వికారాబాద్-కర్ణాటక, గద్వాల-మాచర్లకు రైలు అడిగినా ఇవ్వలేదు. కేంద్రానికి రూ.3.65 లక్షల కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ ఇచ్చింది. కానీ రాష్ట్రానికి కేంద్రం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. కృష్ణానదిలో తెలంగాణ 575 టీఎంసీల నీటివాటా ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తుందని ఆరోపించారు. పాలమూరులో 8 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకనే పాలమూరులో వలసలు తగ్గాయని గుర్తు చేశారు.













