వ్యూహం ప్రకారమే ఈటల దంపతులపై దాడి : కిషన్ రెడ్డి
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై పలివెలలలో జరిగిన రాళ్లదాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. మునుగోడులో నిర్వహించిన మీడియా సమాశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ వ్యూహం ప్రకారమే ఈటల రాజేందర్, ఆయన భార్యపై దాడికి దిగారని ఆరోపించారు. టీఆర్ఎస్ దాడులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందన్నారు. బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది. ఈటల, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లనపై నిఘా పెట్టారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామని తెలిసే టీఆర్ఎస్ దాడులకు దిగుతోంది. డీసీఎం వ్యాన్లలో రాళ్లు, కర్రలు తెచ్చుకొని దాడికి పాల్పడ్డారు. ఇంత జరిగినా గొడవ జరగొద్దనే ఉద్దేశంతోనే ఈటల సంయమనం పాటించారు.
ఇటీవల పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చి నా సభను కూడా అడ్డుకున్నారు. పలివెల గ్రామంలో టీఆర్ఎస్కు ఓట్లు రావని తెలిసి దాడికి దిగారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనిస్తున్నారు. హుజూరాబాద్ ఫలితంతో టీఆర్ఎస్ కాలుకాలిన పిల్లిలా తయారైంది. పోలీసు సిబ్బంది టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని దాడులు చేసినా బీజేపీ కార్యకర్తలు భయపడరు. ఎన్నికల వేళ టీఆర్ఎస్ కార్లను పోలీసులు తనిఖీ చేయడం లేదు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహించాలి అని డిమాండ్ చేశారు.













