ఖైరతాబాద్ మహాగణపతి నమూనా ఆవిష్కరణ

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో 1954లో అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగణపతి ఈ ఏడాదితో 70 ఏళ్లయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మహాగణపతి నమూనాను ఆవిష్కరించారు. ఈ సప్తముఖ మహాశక్తి గణపతి గా 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామి దర్శనమివ్వనున్నారు. నిల్చున్న ఆకృతితో ఉండే గణపతి తలకు ఇరువైపులా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మహంకాలి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు, రెండు వైపులా 14 చేతులు, కుడివైపు చేతుల్లో చక్రం, అంకుశం, పుస్తకం, త్రిశూలం, కమలం, శంఖం, ఎడమవైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉన్నాయి. మహాగణపతి పక్కన కుడివైపు పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాల రాముడి విగ్రహం, ఎడమవైపు రాహుకేతుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. వినాయకుడి పాదాల చెంత 3 అడుగుల మేర మూషిక వాహనం ఉంటుంది. మహాగణపతి కుడివైపు 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణం విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు.