ప్రస్తుతానికి ఫిట్‌గానే కేసీఆర్.. కొన్ని పరీక్షల ఫలితాల కోసం నిరీక్షణ
కరోనా వైరస్ సోకిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో ఉన్న సీఎంకు రెండు రోజుల క్రితం కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ ఫలితం వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సీఎం వ్యక్తిగత వైద్యుడు, యశోద ఆస్పత్రి సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు పర్యవేక్షణలో ఆయనకు వైద్య సేవలు అందుతున్నాయి. ఈ క్రమంలో సీఎంకు కొన్ని రకాల పరీక్షలు చేయాల్సి ఉండడంతో బుధవారం సాయంత్రం ఆయన్ను యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు.
సీఎం కంటే ముందు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ డాక్టర్ ఎంవీ రావును కలిశారు. ఆ తర్వాత కేసీఆర్‌కు సీటీ స్కాన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), సీఆర్పీ, ఐఎల్-6, డీడైమర్, ఫెరిటీన్, ఎల్డీహెచ్, లివర్, కిడ్నీ ఫంక్షన్ .. ఇలా మొత్తం 9 రకాల పరీక్షలు చేశారు. ఇందులో ఐఎల్-6 పరీక్ష చాలా ముఖ్యమని తెలుస్తోంది. శరీరంలో వైరల్ లోడ్ ఎంత ఉంది ? అనేది గుర్తించడానికి ఈ పరీక్ష చేస్తారని సమాచారం. ఈ టెస్టుల నివేదికలు గురువారం వస్తాయని వైద్యులు చెప్తున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగానే ఉన్నాయని, వాటిలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. ప్రస్తుతం ఆయనలో కొవిడ్ సంబంధిత లక్షణాలు ఏవీ లేవని తెలియజేశారు. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ కూడా 98-99 వరకూ ఉన్నాయని, ఎటువంటి సమస్యా లేదని తేల్చిచెప్పారు. బీపీ, శరీర ఉష్ణోగ్రతలు సైతం సాధారణంగానే ఉన్నాయని వివరించారు. సీఎం కేసీఆర్‌ను ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఏమీ లేదని, హోం ఐసొలేషన్ సరిపోతుందని యశోద ఆస్పత్రి వర్గాలు అభిప్రాయపడ్డాయి. దాదాపు 45 నిమిషాల పాటు యశోద ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్.. పరీక్షల అనంతరం తిరిగి ఫాంహౌస్‌కు వెళ్లారు. కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చారు.
ఫిట్‌గానే కేసీఆర్
‘‘సీఎం కేసీఆర్ ఫిట్‌గా ఉన్నారు. ఆయన ఆరోగ్యం మామూలుగానే ఉంది. ఎటువంటి సమస్యా లేదు. మొదటి రోజు కనిపించిన కొవిడ్-19 లక్షణాలు జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం కూడా ఆయనలో పూర్తిగా తగ్గిపోయాయి. రెండో రోజు కాస్త జలుబు ఉండేది. ఔషధాల వాడకంతో.. మూడో రోజుకల్లా జలుబు కూడా తగ్గిపోయింది. ఆక్సిజన్ సాచ్యురేషన్ కూడా సాధారణంగానే ఉంది. ప్రత్యేక వైద్య చికిత్సలు ఏవీ అవసరం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనిస్తే టెస్టుల ఫలితాలన్నీ సాధారణంగానే వస్తాయని అనిపిస్తోంది. అయితే అన్ని రిపోర్టులు రావడానికి రెండు, మూడు గంటలు పడుతుంది. గురువారం ఉదయం వాటిని పరిశీలిస్తాం’’ అని ఎంవీ రావు తెలిపారు.













