మళ్లీ సెంటిమెంటా..?
రాష్ట్రం విడిపోయి పదేళ్లవుతున్నా.. బీఆర్ఎస్ నేతలు మాత్రం సెంటిమెంటును రాజేస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ నుంచి మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సహపలువురు…. ఆంధ్రప్రదేశ్ తో పోలికలు తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమరజ్యోతి ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ .. తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఆ డబ్బులతో ఏపీలో వందెకరాలు కొనచ్చన్నారు. దీనికి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ కంటే ఏపీలోనే భూముల ధరలు ఎక్కవని చెప్పుకొస్తున్నారు.ఏపీ మంత్రి అమర్నాథ్.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పూర్తిగా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
ఏపీలో కంటే తెలంగాణలో భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడో చెప్పిన మాటలను కేసీఆర్ కాపీ కొట్టి అవే మాటలను అనడం సిగ్గుచేటని అమర్నాథ్ విమర్శించారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం వచ్చి ల్యాండ్ రేట్లు తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఇక్కడ ఎకరా రేట్‌కు తెలంగాణలో 150ఎకరాలు కొనొచ్చు అని.. ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈతరుణంలో మరోసారి బీఆర్ఎస్ నేతలు సెంటిమెంటు రాజేస్తున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు ఏపీతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధి చెందిందన్న విషయాన్ని.. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. కాేంగ్రెస్ హయాంలో కరెంటులేదు.. సాగునీటి సమస్య, రైతుల కష్టాలను గుర్తు చేస్తున్నారు. మళ్లీ అలాంటి పాలన మనకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలు.. వైసీపీని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఓవైపు మిత్రపార్టీ కావడంతో ఏమీ అనలేని పరిస్థితి ఉంది. కానీ జాతీయపార్టీగా మారడంతో……… తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటర్లు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ.. పదేపదే బీఆర్ఎస్ నేతల వ్యతిరేక కామెంట్లు.. తమకు ఎక్కడ నష్టం చేకూరుస్తాయో అన్న భయం వైసీపీలో కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని రాష్ట్ర ఓటర్లు ప్రభావితం అవుతారా అన్నకోణంలోనూ వైసీపీ నేతలు ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆంధ్ర వ్యతిరేకతతో పుట్టిన పార్టీ కావడంతో.. ఇక్కడ అంత ఇబ్బంది ఉండకపోవచ్చన్న భావన ఫ్యాన్ పార్టీనేతల్లో ఉంది.













