KCR : మళ్లీ చంద్రబాబు పాట పాడిన కేసీఆర్! ఇంకెన్నాళ్లు..?
దాదాపు ఎనిమిది నెలల సుదీర్ఘ మౌనం తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. అయితే, ఆయన మాటల్లో పదును తగ్గలేదు కానీ, ఎంచుకున్న అంశం మాత్రం దశాబ్దాల కాలం నాటిదే కావడం విడ్డూరం. ఇప్పుడు కూడా చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలమూరును దత్తత తీసుకున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. దత్తత తీసుకున్నా జిల్లాకు ఒరిగిందేమీ లేదని, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని, కానీ తాను మాత్రం ప్రాజెక్టుల రక్షణ కోసం పోరాడుతానని కేసీఆర్ ఉద్ఘాటించారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పాత విషయాలను వెలికితీస్తున్నారు. ప్రధానంగా మూడు అంశాలపై కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు. గతంలో కేసీఆర్ మహబూబ్నగర్ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు, తానూ ఈ జిల్లాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. పాలమూరులోనే ఇల్లు కట్టుకుని ఉంటానని చెప్పారు. మరి పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పదేళ్ల పాటు తిరుగులేని అధికారంలో ఉన్న కేసీఆర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడానికి గత పదేళ్ల వైఫల్యాలను వదిలేసి, మళ్ళీ పాత ప్రత్యర్థి చంద్రబాబు మీదకు నెట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయింది. ఇప్పుడు అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నిరుద్యోగం వంటి అంశాల చుట్టూ రాజకీయాలు నడవాలి. కానీ కేసీఆర్ మాత్రం ఇంకా ‘ఆంధ్ర నేతలు అడ్డుకుంటున్నారు’ అనే సెంటిమెంటును రగల్చడం ద్వారా తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారా? అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ అకస్మాత్తుగా చంద్రబాబును తెరపైకి తీసుకురావడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కేడర్ నీరసించిపోయింది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి బయటి శత్రువును చూపించడం కేసీఆర్ పాత పద్ధతి. అందుకే చంద్రబాబు పేరును వాడుకుంటున్నారని విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే, వాటికి చంద్రబాబు లింకును జోడించడం ద్వారా తెలంగాణలో మళ్ళీ ప్రాంతీయ సెంటిమెంటును బలోపేతం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుతో సఖ్యతగా ఉంటోందనే భావన ప్రజల్లో కలిగించి, తానే నిఖార్సైన తెలంగాణ వాది అని నిరూపించుకునే ప్రయత్నం ఇది.
ఒకప్పుడు చంద్రబాబును విమర్శిస్తే తెలంగాణలో ఓట్లు పడేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏపీలో చంద్రబాబు భారీ విజయంతో అధికారంలోకి రావడం, తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన సాగుతుండటంతో ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. పదేళ్ల తర్వాత కూడా పాత రికార్డునే ప్లే చేయడం కేసీఆర్కు రాజకీయంగా లాభిస్తుందా లేక రివర్స్ అవుతుందా అనేది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది.






