ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పెంపు
నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేత నాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ పక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామ కాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాల న్నింటినీ ఫిబ్రవరి లోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల పక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు.
త్రిసభ్యకమిటీ నియామకం
ఉద్యోగసంబంధ అంశాలన్నింటిపై అధ్యయనం చేయ డానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూ పొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గ మేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాల పై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది.
పదవీవిరమణ వయసు పెంపు
’’ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతామని టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలనే విషయంలో అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చిస్తుంది. అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ప్రభుత్వంలోని అన్ని రకాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొత్త సంవత్సరం సందర్భంగా బొనాంజా ప్రకటించారు. అన్ని శాఖల్లో.. అన్ని క్యాటగిరీల్లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులందరికీ వేతనాలు, ఉద్యోగ విరమణ వయోపరిమితిని పెంచాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు ఇచ్చి.. ఖాళీ ఉద్యోగాల భర్తీ పక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రభుత్వోద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్డ్, డైలీ వేజ్, ఫుల్‌టైమ్ కంటింజెంట్, పార్ట్‌టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశావర్కర్లు, విద్యావాలంటీర్లు, సెర్ప్ ఉద్యోగులు, గౌరవవేతనాలు అందుకొంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతామని వెల్లడించారు. రాష్ట్రంలో అన్నిరకాల ఉద్యోగులు 9,36,976 మంది ఉంటారని, వీరందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని చెప్పారు. ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.













