కేసీఆర్, హరీష్ రావుకు జగ్గారెడ్డి ధన్యవాదాలు.. అసలు కారణం అదే..
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఎప్పుడూ విమర్శలు ప్రతివిమర్శలు చేసే జగ్గారెడ్డి ఒక్కసారిగా వారికి ధన్యవాదాలు చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లా కేంద్రాల్లో భోధనాసుపత్రులను కేసీఆర్ ప్రారంభించారు. వాటిలో మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని బోధనాసుపత్రి కూడా ఉంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి..బోధనాసుపత్రిని ప్రారంభించిన సీఎం కేసీఆర్, పనులను వేగంగా జరిగేలా చేసిన హరీష్ రావుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి బోధనాసుపత్రికి కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కూడా మెదక్‌కు సంగారెడ్డి కేంద్రంగా ఉండేది. ఆనాడు కూడా సంగారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగిన జగ్గారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 2013లో సంగారెడ్డికి బోధనాసుపత్రిని మంజూరు చేయించుకున్నారు. అయితే ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ సర్కార్ దానిని సిద్దిపేటకు తరలించిందని, ఈ విషయంపై తాను అసెంబ్లీలో పోరాడి తిరిగి సంగారెడ్డికి తెప్పించుకున్నానని తెలిపారు. బోధనాసుపత్రిని సంగారెడ్డి ప్రకటించిన కేసీఆర్ నిధులు కూడా మంజూరు చేశారని, విపక్షంలో ఉన్న వాళ్లం కాబట్టి పనులు కాకపోతే కాలేదనే చెప్తామని, పనులు పూర్తయితే అయ్యానే చెబుతామని అన్నారు. విపక్ష నేత అధికారంలో ఉన్న ప్రాంతంలో కూడా బోధనాసుపత్రిని వేగంగా పూర్తిచేయించి ప్రారంభించిన కేసీఆర్, హరీష్‌రావులకు ధన్యవాదాలని అన్నారు.













