అంతర్జాతీయ సదస్సులకు వేదికవుతోన్నభాగ్యనగరం

జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు భాగ్య నగరం వేదికవుతోంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయస్థాయి సదస్సులు నిర్వహించడానికి స్థానిక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే, శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు కనబరుస్తున్న శ్రద్దే కారణమని తెలుస్తోంది. నగరంలో ప్రపంచ స్థాయి సదస్సులు నిర్వహించేందుకు విదేశీ కంపెనీలు సైతం ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్‌కు నగరంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా, భారత్ సంయుక్తంగా నిర్వహించే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ అధ్యక్షత వహించనున్నారు. అమెరికా పారిశ్రామికవేత్తలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలకు చెందిన 15 వందల మంది ప్రతినిధులు ఈ కార్యక్రమాన్నికి హాజరుకానున్నారు.
2018లో కూడా పలు అంతర్జాతీయ సదస్సులు, వర్క్‌షాప్‌లు హైదరాబాద్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హెచ్ఐసీసీ వేదికగా 78వ స్కాల్ అంతర్జాతీయ పర్యాటక సదస్సు జరగనుంది. అలాగే జనవరిలో ఓయూలో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగనుంది. జీవ పరిణామక్రమానికి సంబంధించిన జీవకణ సదస్సు జనవరి 27 నుంచి 31 వరకు నగర శివారులోని లియోనియా రిసార్ట్‌లో జరగనుంది. గతంలో పోల్చుకుంటే హైదరాబాద్‌లో మౌలిక వసతులు కల్పన భారీగా పెరిగింది. అలాగే శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ సేఫ్ ప్లేస్‌గా నిలవడంతో ఇప్పుడు అందరి దృష్టి భాగ్యనగరాన్ని ఆకర్షిస్తుంది.











































































