మేయర్ ఎన్నికపై ఎవరైనా సంప్రదిస్తే… చర్చించి చెబుతాం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు ఏ పార్టీతో చర్చించ లేదని ఏఐఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సృష్టం చేశారు. మేయర్ ఎన్నికపై ఎవరైనా సంప్రదిస్తే పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గెలుపొందిన కార్పొరేటర్లతో ఒవైసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారం చేసిన తీరుపై మండిపడ్డారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేసిన వార్డులోనూ బీజేపీ గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా ప్రజల తీర్పును గౌరవించాలన్నారు. భవిష్యత్తులో జరగబోయే ప్రధాన ఎన్నికల్లో బీజేపీ అంతా ప్రభావం చూపలేకపోవచ్చని అసద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్పై ప్రజలకు అభిమానం ఉందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోల్పోయిన స్థానాలపై ఆ పార్టీ ఆలోచించుకోవాలన్నారు. బీజేపీతో ఎంఐఎంకు ఎలాంటి పోటీ లేదని సృష్టం చేశారు.













